Site icon 123Nellore

కళ్యాణదుర్గం ఘటనపై అచ్చెన్నాయుడు రియాక్షన్

వైసీపీ నేతల అతి, అత్యాత్సాహానికి అడ్డులేకుండో పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే సంబరాల్లో మునిగిన మంత్రి వైసీపీ నేతలు కనీసం దారి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్య్తం చేశారు. శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం అందించడం ఆలస్యమై పండు అనే చిన్నారి మృతి చెందిందని శిశు సంక్షేమ మంత్రిగా ఉండి శిశువుల ప్రాణాలు తీస్తారా.? అని విమర్శించారు. కనీసం బాధితులను పరామర్శించేంత ఓపిక, సమయం కూడా మంత్రికి లేదా అని దుయ్యబట్టారు.

‘‘మొన్న పినిపే విశ్వరూప్ ర్యాలీలో రోడ్లపై నోట్ల కట్టలు వెదజల్లి, జీరో కట్లు అంటూ గంటల పాటు వాహనదారులను ఇబ్బందులు పెట్టారు.  ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వస్తే జనం బలవ్వాల్సిందేనా.? మీ సన్మానాలకు, విహారయాత్రలకు బయటకు వస్తే ప్రజల ప్రాణాలు అడ్డుపెట్టాలా.? శుక్రవారం నాడు శ్రీకాళహస్తి ఆలయానికి మంత్రి కొట్టు సత్యనారాయణ వస్తున్నారని మూడు గంటల సేపు భక్తులను క్యూలో నిలబెట్టారు. చిన్నారులు, వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదా.? వాళ్ల ఆర్తనాదాలు ఎవరు ఆలకించాలి.?

మనశ్శాంతి కోసం, భక్తికోసం గుడికి వస్తున్న జనాలను వైసీపీ నేతలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలే ఎండాకాలం, దేవాలయాల్లో అంతంత మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటన చూసి కూడా సిగ్గు తెచ్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి బయటకు వచ్చినా గంట ముందు నుండి జనాన్ని కదలనివ్వడం లేదు. సీఎం కారు ఎక్కితే చాలు షాపులు మూసుకుని లోపలే ఉండాలని హెచ్చరించడం ఇదెక్కడి సంస్కృతి.? మంత్రులు, వైసీపీ నేతల తీరు మార్చుకోవాలి. మా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తాం.. ఇలాగే చేస్తామని అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజల చేతిలో బడితపూజ తప్పదు’’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Exit mobile version