టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడును గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్లు పూర్తైన సందర్బంగా శ్రీకాకుళం జిల్లా, టెక్కలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు రోడ్ల మీద దొర్లించి, ఈడ్చి ఈడ్చి కొట్టకపోతే తాను దువ్వాడ శ్రీనివాస్‍నే కాదని శపథం చేశారు. అచ్చెన్నాయుడును తన్నడానికి ఒక్క నిమిషం చాలు అని, టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడును టీడీపీ అధ్యక్షుడిని చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డు మీద కనబడితే అంకుశం సినిమాలో విలన్ రామిరెడ్డిని కొట్టినట్లు కొడతానని అన్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే కోసం ఆత్మహుతి దళంగా మారతానని, అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మహానాడులో నోటికొచ్చినట్లు మాట్లాడిన వారు, మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మహిళల జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, అది తమ పార్టీ మహిళా నేతలు చూసుకుంటారని తెలిపారు. జగన్ గురించి మరోసారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
అచ్చెన్నాయుడును రాజకీయంగా పతనం చేయడమే తన ఆశయం అని పేర్కొన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరించాలని హెచ్చరించారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే ఆగేది లేదని స్పష్టం చేశారు. అయితే గతంలోనూ దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడుపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఓరేయ్ అచ్చెన్నాయుడు, దున్నపోతు అచ్చెన్నాయుడు అని ధ్వజమెత్తారు. దీనిపై టీడీపీ నేతలు స్పందించాల్సి ఉంది.