ఇటీవలి కాలంలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల రేంజ్ పెరిగిపోయింది. ‘బాహుబలి’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’, ‘RRR’, ‘కేజీయఫ్’, ‘కేజీయఫ్-2’ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలతో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు బాలీవుడ్‌లోనూ సూపర్‌సక్సెస్‌ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడందరి చూపు దక్షిణాదిపైనే ఉంది. దీంతో బాలీవుడ్, దక్షిణాది నటీనటుల మధ్య పరోక్షంగా మాటల యుద్ధం నడుస్తోంది.
తాజాగా దీనిపై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సైతం దక్షిణాది చిత్రపరిశ్రమపై కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా అన్న పదమే తప్పన్నాడు. దక్షిణాది సినిమాలు బాలీవుడ్ లో విడుదల కావడం మంచి పరిణామమని వ్యాఖ్యానించాడు. అయితే, పాన్ ఇండియా అనే వర్గీకరణ మాత్రం మంచిది కాదని, తాను దానిని నమ్మనని చెప్పాడు. అసలు పాన్ ఇండియా అంటే ఏంటంటూ ప్రశ్నించాడు.
రీమేక్స్ చేయడమంటే ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవడం మాత్రమేనని అమితాబ్ అన్నారు. ‘‘భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎంతో పెద్దది. ఎన్నో భాషలు, సంస్కృతులతో కూడుకున్నది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకున్న చిత్రాలు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా రీమేక్ అవుతుంటాయి. హిందీ సినిమాలను కూడా రీమేక్ చేస్తుంటారు. రీమేక్ చేయడమంటే క్రియేటివ్ ఆలోచనలు పంచుకోవడమే. దక్షిణాది చిత్రాలు హిందీలోకి, అలాగే ఇక్కడి సినిమాలు అక్కడి భాషలకు రీమేక్ చేయడమనేది సుమారు 70 ఏళ్ల నుంచి జరుగుతోంది. రీమేక్ చేస్తున్నామంటే అర్థం బాలీవుడ్‌లో టాలెంట్‌కి కొరత ఉందని కాదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఏడాది వెయ్యికి పైగా చిత్రాలు బయటకు వస్తుంటాయి. (ఆర్‌ఆర్‌ఆర్, కేజీయఫ్-2ని ఉద్దేశిస్తూ..) అందులో కేవలం రెండు చిత్రాలే ట్రెండ్‌ని ఎలా నిర్దేశిస్తాయి..?’’ అని అభిషేక్ ప్రశ్నించారు.