టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు… ఈ విషయాన్ని గతంలో ఎన్నో సార్లు ఎంతో మండి ఎన్నో సందర్భాల్లో రుజువు చేశారు. కొందరికి అది పుట్టుకతోనే వస్తుంది. దానికి కాస్తంత మెరుగులు పెట్టాలే కానీ వారు అద్భుతాలు సృష్టిస్తారు. సరిగ్గా ఓ బాలిక కూడా అదే పని చేసింది. సరిగ్గా నోరు తిరగని వయస్సులో ఏకంగా పెద్ద పెద్ద మంత్రాలు చదివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒడిశాలోని జగత్‌సింగ్ పూర్ జిల్లాలో ఉన్న తారాడపాడ గ్రామానికి చెందిన రష్మి రజంన్ మిశ్రా కుమార్తె డి.సాయి శ్రేయాంసి వయస్సు 6 ఏళ్లు.
1వ తరగతి చదువుతున్న ఈ చిన్నది ఎంతో కష్టమైన మంత్రాలను అవలీలగా పఠిస్తోంది. తాజాగా ఈ బాలిక 24 నిమిషాల 50 సెకన్లలో ఏకంగా 108 మంత్రాలు చదివి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాను రోజూ ఇంట్లో పఠించే మంత్రాలను శ్రద్ధగా విని నేర్చుకున్నానని ఆ బాలిక తెలియజేసింది. అంతేకాదు.. ఆమెకు ఒడిస్సీ నృత్యం కూడా తనదైన శైలిలో చేస్తూ అందర్నీ అబ్బురపరుస్తుంది. త్వరలోనే అందులోనూ పేరు తెచ్చుకుంటానని ఆ బాలిక చెబుతోంది. ఏది ఏమైనా.. ఇంత చిన్న వయస్సులో అంత కఠినమైన మంత్రాలను పఠిస్తుందంటే… ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కాగా ఈ బాలిక సాధించిన ఈ ఫీట్‌కు గాను ఈమె పేరును ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం ఈ చిన్నారి వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.