Site icon 123Nellore

33 కోట్ల రూపాయలతో నెల్లూరు చెరువు వద్ద ట్యాంక్ బండ్ నిర్మించి తీరుతామన్న మేయర్ అజీజ్

నెల్లూరు నగరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కార్పోరేషన్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పర్యటించారు. 
పర్యటనలో భాగంగా అన్నమయ్య సర్కిల్, ముత్తుకూరు గేట్, విజయమహల్ గేట్ అండర్ బ్రిడ్జ్, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాలలోని రోడ్ డివైడర్ల మధ్య పెరుగుతున్న మొక్కలను మేయర్ పరిశీలించారు. విజయమహల్ గేట్ అండర్ బ్రిడ్జ్ లో నిలవ ఉన్న నీరు వాహన చోదకుల పైన చిందుతూ ఉండటాన్నిగమనించి, సమస్యను వెంటనే సరిచేయ్యాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
అనంతరం ఎ.బి.ఎం స్కూల్ వద్ద మేయర్ ప్రసంగిస్తూ రాబోయే 6 నెలల కాలంలో నగరాన్ని సుందరీకరణ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.  పచ్చదనానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తూ నగరంలో 15 కిలోమీటర్ల మేర గ్రీనరీ కనిపించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవతో మంజూరైన రూ 33 కోట్ల తో స్వర్ణాల చెరువు తీరాన నూతనంగా ట్యాంక్ బండ్ ను నిర్మించి, ప్రాంగణాన్ని ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దుతామని  మేయర్ చెప్పారు. పాదాచారులకోసం నగరంలో ఫుట్ పాత్ ల అవసరం చాలా ఉందనీ, అవసరమైన చోట్ల రోడ్లను విస్తరించి ఫుట్ పాత్ ల నిర్మాణానికి ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని వివరించారు.
రాబోయే పదేళ్ళ కాలంలో నగరానికి తగిన మౌళిక, పర్యావరణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని  ఇప్పటినుంచే అభివృద్ధికి రూపకల్పన  చేస్తున్నామన్నారు. ఇందుకుగాను రాబోవు మూడేళ్ళ కాలంలో రూ 100 కోట్ల నిధులను కార్పోరేషన్ నుంచి ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వెంట అధికారులతో పాటు కార్పోరేటర్ దొడ్డపనేని రాజానాయుడు, టి.డి.పి నాయకులు నన్నేసాహెబ్, షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

14.442598779.986456
Exit mobile version