Site icon 123Nellore

వర్శిటీలో ఎందుకిలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వైస్-ఛాన్సలర్ కు నాయకుల ప్రశ్న

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) విక్రమ సింహపురి యూనివర్సిటీ శాఖ నాయకులు మరియు విద్యార్థులు చేప్పట్టిన నిరవధిక దీక్షలకు మూడో రోజు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిథి కర్నాటి ఆంజనేయ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. వారు వెళ్లిన వెంటనే వర్శిటీ విద్యార్థులు అందరూ శిబిరం వద్దకు తమ మద్దతు తెలిపేందుకు చేరుకొని వర్శిటీ అధికారుల నుండి, ప్రభుత్వం నుండి స్పందన లేదని వీఆర్సీ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు రాగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ABVP నాయకులను మరియు విద్యార్థులను అరెస్ట్ చేసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం డీఎస్పీ వెంకటరాముడు వర్శిటీ వైస్-ఛాన్సలర్ ను విద్యార్థులతో చర్చలకు తప్పక రావాల్సిందిగా కోరారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వైస్-ఛాన్సలర్ వీరయ్య ను విద్యార్థులు పలు సమస్యల పై ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసారు. ఇంతలో విషయం తెలుసుకున్న నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో అందర్నీ సముదాయించి దీక్షా స్థలి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికే బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిథి కర్నాటి ఆంజనేయ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సురేంద్ర రెడ్డిలు కూడా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థుల సమక్షంలో నాయకులు వీసీని ప్రశ్నించారు. వర్శిటీ నూతన భవనాల్లోకి చేరేది ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వం నుండి అనుమతి కొరకు చూస్తున్నామని, కొంత పెండింగ్ బిల్లుల చెలింపు కూడా చేయాలని వీసీ సెలవిచ్చారు. సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి అంగీకారం తీసుకుంటామని తెలిపారు. గత సంవత్సర కాలానికి పైగా వర్శిటీ అవినీతిలో ఎందుకు కూరుకుపోయిందని, వర్శిటీని ఎందుకు నాశనం చేస్తున్నారని వీసీని ప్రశ్నించారు. అత్యంత అవినీతిపరుడిగా పేరుగాంచిన రిజిస్ట్రార్ శివశంకర్ ను ఎందుకు కొనసాగిస్తున్నారని నాయకులు అడిగిన ప్రశ్నకు శివశంకర్ పై ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదని వీసీ వెనకేసుకు వచ్చారు. మరి విచారణ జరపండి అని నాయకులు సూచించగా ఆ పని ప్రభుత్వానికి తెలియజేసి విచారణ జరిపించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులైన మీదే అని వీసీ సెలవిచ్చారు. దీంతో ఆగ్రహించిన నాయకులు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటూ ఇలా మాట్లాడడం సహేతుకంగా లేదని, మీరు వీసీగా వచ్చిన తర్వాతనే వర్శిటీ వీధిన పడిందని, కాంట్రాక్టు అధ్యాపకులను విధుల్లో నుండి తొలగించి వారి కడుపులు కొట్టారని, ఇలా అనేక దుశ్చర్యలు జరిగాయని, ఇంకా జరుగుతున్నాయని, మీకు బాధ్యత లేకపోయినా ఈ జిల్లా నాయకులుగా వర్శిటీ సమస్యలను తమ భుజానికి ఎత్తుకుని పరిష్కారం చేస్తామని తెలిపారు. చివరగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “వీసీ గారూ, మీరు గతంలో వర్శిటీ లో జరిగిన వివాదం సమయంలో శివశంకర్ వ్యవహారశైలి పై, అక్రమాల ఆరోపణలపై విచారణ జరపాలని ప్రభుత్వానికి లేఖ వ్రాస్తానని నా సమక్షంలోనే తెలియజేసారు. వ్రాసారా?” అని ప్రశ్నించగా వ్రాసానని వీసీ బదులిచ్చారు. “మరి ఆ కాపీని అన్ని విద్యార్థి సంఘాల వారికి ఇస్తామని తెలిపారు. ఇచ్చారా?” అని అడగ్గా తనని ఎవ్వరూ అడగలేదని వీసీ బదులిచ్చారు. ప్రక్కనే ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు వీసీ అబద్ధాలు ఆడుతున్నారని, కలవాలని వెళ్లే విద్యార్థి నాయకులను పరిపాలనా భవనం లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. విద్యార్థులను కోటంరెడ్డి శాంతపరచి “వీసీ గారు, లేఖ వ్రాసానని చెప్పారు కదా. మీరందరూ రేపు వెళ్లి కాపీని తీసుకోండి. నేను కూడా నా అధికారిక లెటర్ హెడ్ పై కావాలని అడుగుతూ నా పి.ఏ ని పంపిస్తాను. ఇచ్చి పంపండి.” అని తేల్చి చెప్పారు. దీనికి వీసీ వీరయ్య అంగీకరించగా విద్యార్థి నేతలకు సర్దిచెప్పి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు మన నాయకులు.
Exit mobile version