నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నగరంలోని 48 వ డివిజన్ కుక్కల గుంట, మునిసిపల్ క్వార్టర్స్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. దోమల నివారణకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగినంత నిధులు కేటాయించట్లేదని దుయ్యబట్టారు. ఏదైనా మంచి జరిగితే అది తనవల్లే జరిగిందని గొప్పలు చెప్పుకోవడం, తారుమారైతే అధికారులపైకి నెట్టేయడం ముఖ్యమంత్రికి వెన్నతో పెట్టిన విద్యన్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజల నోట్ల కష్టాలు తీర్చేందుకు చంద్రబాబు వెంటనే ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి తక్షణం 5 వేల కోట్ల రూపాయలను తీసుకురావాలని సూచించారు. చిన్నా చితకా ప్రజలు ఎన్నో ఏళ్ళుగా దాచుకున్న ధనాన్ని ఇప్పుడు నల్లధనం అని చెప్పి కేంద్రప్రభుత్వం 50 శాతం మేర తీసుకోవడం దోచుకోవడం అవుతుందని తెలిపారు. కోట్లాది రూపాయలు ఆస్తుల పేరిట కూడబెట్టిన నల్లకుబేరులను ఏమీ చేయలేక సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తున్నదని విమర్శించారు.