Site icon 123Nellore

బీచ్ లో విషాదం – అయిన వారికి మిగిలింది శోకం

వారంతా నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు. నెల్లూరు ఇసుక డొంకకు చెందిన షేక్ నజీమ్ (22),  రైలు వీధికి చెందిన షేక్ ముసవీర్ (24), కునుపర్తిపాడుకి చెందిన బైనమూడి హరీష్ (24), అంబాపురానికి చెందిన సుబ్రహ్మణ్యందేవ, రైలు వీధికి చెందిన రబ్బానీ బాషా, ఫాజల్, బట్వాడిపాళెంకు చెందిన గజేంద్ర ఉదయ్ ఎంతో కాలంగా స్నేహితులుగా ఉన్న ఈ ఏడుగురు ఆదివారం సరదాగా బీచ్ కు వెళదామని ప్రయాణమయ్యి మైపాడు బీచ్ చేరుకున్నారు.ముసవీర్, రబ్బానీ బాషాలు క్యూబా కాలేజీలో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. నదీమ్, సుబ్రహ్మణ్యం, గజేంద్ర ఉదయ్ లు బురాన్ పూర్ సమీరంలోని హీరో హోండా షో రూమ్ లో పనిచేస్తున్నారు. నదీమ్ తన తండ్రి సర్వీసుకు తీసుకొచ్చిన మారుతీ వ్యాన్ ని సిద్ధం చేసి స్నేహితులతో మైపాడు కు చేరారు. 

అందరూ ఈదే చోట ఈదకుండా ప్రక్కన ఈదారు

వీరు మైపాడు లో పర్యాటకులు ఎక్కువుగా నీటిలో దిగే ప్రాంతంలో కాకుండా ప్రక్కనే చేపలు ఆరబెట్టే ప్రాంతం సమీపంలో సముద్రంలో దిగారు.

సెల్ఫీ కోసం సముద్ర లోతుల్లోకి

ఆ ప్రాంతంలో అలల తాకిడి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే ఆ అలల ఉదృతి ముందు తామున్నట్లు సెల్ఫీ తీయాలని వారు ప్రయత్నించారు. అలా వారు సముద్ర లోతుల్లోకి వెళ్లి అక్కడ చిక్కుకున్నారు. అలల తాకిడి ఉదృతం అవడంతో అర్థం కాక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అతి కష్టం మీద ఒడ్డుకు సమీపంలోకి చేరిన గజేంద్ర ఉదయ్ పెద్దగా కేకలు వేయగా అక్కడి మత్స్యకారుల గమనించారు. 

నలుగురిని కాపాడిన మత్స్యకారులు

మత్స్యకారులు హుటాహుటిన సముద్రంలోకి దూకి అందర్నీ కాపాడే ప్రయత్నం చేసారు. కానీ నలుగురినే కాపాడగలిగారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో నజీమ్, ముసవీర్, హరీష్ మృతి చెందారు. 

సంఘటనా స్థలానికి చేరిన పోలీసులు 

పోలీసులకు తెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన మిగిలిన స్నేహితులు మృతదేహాలను కారులో ఎక్కించుకుని కుటుంబసభ్యులకు చేర్చారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు తర్వాత మృతుల కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లగా కేసులేమీ వద్దని కోరడంతో ఇక చేసేదేమి లేక వెనుదిరిగారు. సంఘటన పై విచారణ జరుపుతున్నారు.

శోకసంద్రంలో కుటుంబాలు

అప్పటి వరకు తమతోనే ఉన్న తమ పిల్లలు ఇక లేరనే విషయాన్ని ఆ కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారి రోదనని ఎవ్వరూ ఆపలేకపోయారు. ముసవీర్ ను తన తండ్రి ముస్తాక్ ఎంతో క్రమశిక్షణతో పెంచాడని స్థానికులు తెలియజేస్తున్నారు. ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్న కుమారుడు లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నదీమ్ సైతం తన తండ్రి నజీర్ మాట జవదాటే వాడు కాదు. అతనికి పెళ్లి చేయాలనే ఆలోచలనో ఉన్న ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఈ మరణ వార్త గునపం దింపింది. దేవుడు తమకు ఇంతపెద్ద శిక్ష ఎందుకు వేశాడా అని గుండెలవిసేలా రోదించారు. హరీష్ కు ఏడాదిన్నర క్రితం పూజా రోహితతో వివాహమైంది. సముద్ర స్నానానికి వెళ్తున్నానని చెప్పిన భర్త విగతజీవిగా మారడంతో రోహిత గుండెలవిసేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.
Exit mobile version