Site icon 123Nellore

ఫలించిన పోరాటం – కాలువల నిర్మాణాన్ని పరిశీలించిన మేయర్ అబ్దుల్ అజీజ్

అతను ఓ సామాన్య పౌరుడు. పేరు సతీష్ చంద్.  తమ స్వార్థం తమదని బ్రతుకుతున్న ఈ సమాజంలో నిస్వార్ధంగా ‘Fight for a better Nation’ అంటూ పిలుపిస్తున్నాడు. ఇటీవల నెల్లూరు నగరంలో విరివిగా జరుగుతున్న కాలువల నిర్మాణాల పనితీరు ఎలా ఉందో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా సమాజానికి చాటాడు. స్థానిక నవలాకులతోట ప్రాంతంలో నాసిరకంగా జరుగుతున్న కాలువల నిర్మాణం గురించి ప్రశ్నిస్తూ వీడియో చిత్రీకరించి ఆ వీడియో నగర మేయర్, జిల్లా కలెక్టర్ ల దృష్టికి వెళ్ళేలా షేర్లు చేయండని ప్రజల్ని అభ్యర్ధించాడు. అతని అభ్యర్ధనని “మేయర్ గారూ… ఇలాగేనా కాలువల నిర్మాణం చేపట్టేదంటూ ప్రశ్నిస్తున్న నెల్లూరు యువకుడు” అని నవంబర్ 11 న 123Nellore వెబ్ సైట్ లో కూడా ప్రచురించడం జరిగింది. ఫేస్ బుక్ లో అతని అభ్యర్ధన 600 పైగా షేర్లు దాటి, 30 వేలకు పైగా వ్యూస్ లభించాయి. 123Nellore వెబ్ సైట్ ద్వారా 10 వేల మందికి పైగా చేరింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మేయర్ అబ్దుల్ అజీజ్ వరకూ చేరింది. స్పందించిన మేయర్ కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని పంపించి నిర్మాణ పనులను సమీక్షించారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ నిర్మాణ కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఇలానే కొనసాగితే బిల్లులు ఆపేస్తామని హెచ్చరించారు. బుధవారం నాడు స్వయంగా సంబంధిత ప్రాంతాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారు. సమస్యను సమాజానికి చాటిన సతీష్ ను అభినందించారు. తన స్వార్థం తనదని చూడకుండా సమాజ శ్రేయస్సు కోసం అభిలషించిన సతీష్ ను నెల్లూరు ప్రజలు అభినందిస్తున్నారు. 
Exit mobile version