పనాజీ/ బెళగావి లలో నవంబర్ 13 న జరిగిన సభల్లో ప్రధాని ప్రసంగించారు. నోట్లరద్దు వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ.. 50 రోజులపాటు (డిసెంబర్ 30 వరకూ) తనకు సహకరించాలని, దేశాన్ని అవినీతి రహితంగా మారుస్తానని తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు నాకు తెలుసు. కానీ, అవి కేవలం 50 రోజుల వరకే. దేశాన్ని నల్లధనం నుంచి ప్రక్షాళన చేయాలన్న లక్ష్యసాధనలో మనం 50 రోజుల తర్వాత విజయం సాధిస్తాం. ఆ తర్వాత ఒక్క దోమ కూడా మిగలదు. నా (నోట్లరద్దు) నిర్ణయాన్ని దయచేసి అహంకారంగా భావించవద్దు. డిసెంబర్ 30 వరకూ నాకు సహకరించండి. నా ఆలోచనల్లో, నా కార్యాచరణలో మీకు ఏమైనా తప్పులు దొరికితే నన్ను బహిరంగంగా ఉరితీయండి.
మీరు కోరుకున్న భారతదేశాన్ని అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ ఉద్వేగపూరితంగా మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని అవినీతి రహితంగా మలచటానికి తన వద్ద మరిన్ని ఆలోచనలున్నాయని… పెద్దనోట్ల రద్దన్నది ఆరంభం మాత్రమేగానీ అంతంకాదని ప్రధాని స్పష్టం చేశారు. బినామీ ఆస్తుల మీద కచ్చితంగా చర్యలను తీసుకుంటామన్నారు. జపాన్ పర్యటనను ముగించుకువచ్చిన ప్రధాని మోదీ… గోవాలోని పనాజీ, కర్ణాటకలోని బెళగావిలలో ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. రూ.500, 1,000 నోట్ల రద్దుపై అటు ప్రజల్నించి ఇటు రాజకీయపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో… మోదీ ఈ అంశానికి సంబంధించిన పలుకోణాలను స్పృశిస్తూ మాట్లాడారు. ఏడు దశాబ్దాలుగా దోచుకున్న సొమ్ము… నోట్లరద్దుతో వృథాగా మారిన నేపథ్యంలో కొన్ని శక్తులు తనపై కత్తులు నూరుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి పరిణామాల్నైనా ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. దేశంలో నగదురహిత లావాదేవీలు మొదలుకావాలని, ప్లాస్టిక్‌మనీ విస్తృతవినియోగంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే…
అవినీతిపై కాంగ్రెస్ పోరాడలేదు
నా మంత్రివర్గ తొలి సమావేశంలోనే.. నల్లధనం వెలికితీత కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటుచేశాను. మేం అధికారంలోకి వచ్చిన కొన్నిరోజుల్లోనే… విదేశాలకు తరలిపోయిన నల్లధనంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. నల్లధనంపై పోరాటానికి సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాల్ని అందిస్తూనే ఉన్నాం. ఈ విషయంలో వివరాల్ని నేనేమైనా దాచిపెట్టానా? స్వచ్ఛంద వెల్లడి పథకం కింద ఇప్పటివరకూ రూ.67వేల కోట్ల మొత్తాన్ని సేకరిం చాం. ఐటీశాఖ దాడులు, సర్వేలు, డిక్లరేషన్లు తదితర మార్గాల్లో గడిచిన రెండేండ్లలో ప్రభుత్వం రూ. 1,25,000 కోట్ల మొత్తాన్ని ఖజానాకు జమచేసింది. నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చటానికి చిన్నమోతాదుల్లో ఔషధాన్ని ఇస్తున్నా. దీంట్లోభాగంగానే జన్‌ధన్‌యోజనను కూడా తీసుకొచ్చాంఅని మోదీ తెలియజేశారు.
అత్యంత రహస్య ఆపరేషన్
భయాందోళన వద్దు
నా (నోట్లరద్దు) నిర్ణయాన్ని దయచేసి అహంకారంగా భావించవద్దు. అత్యున్నతమైన (ప్రధాని) పదవిని అధిష్ఠించటం కోసమే నేను పుట్టలేదు. దేశం కోసం నేను నా గ్రామాన్ని, నా కుటుంబాన్ని వదిలేశాను. నల్లధనం, అవినీతిపై చేపట్టిన పోరాటంలో నాకు పేదలతోపాటు అనేకమంది తల్లుల ఆశీస్సులున్నాయి. ఈ పోరాటంలో ఈ ఆశీస్సులే చోదకశక్తిగా పని చేస్తున్నాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న నేను నిర్ణయాన్ని ప్రకటించిన రోజున… కోట్లాదిమంది జనం ప్రశాంతంగానే పడుకున్నారు. కానీ అవినీతిపరులైన కొన్ని లక్షలమంది మాత్రం నిద్రను కోల్పోయి నిద్రమాత్రలను వెతుక్కున్నారు. మీకు (ప్రజలకు) దిగ్భ్రాంతిని కలిగించే మరో విషయం ఏమిటంటే… రూ.రెండు లక్షలకన్నా ఎక్కువ విలువైన ఆభరణాల కొనుగోళ్లలో వినియోగదారుల పాన్ నంబర్‌ను వ్యాపారులు తప్పనిసరిగా తీసుకోవాలంటూ ప్రభుత్వం చట్టం చేసినప్పుడు… సగానికిపైగా ఎంపీలు… ఆ నిబంధనల్లో సడలింపునివ్వాలంటూ నన్ను సంప్రదించారు. కొందరు నాకు లేఖలు రాసే ధైర్యం కూడా చేశారు. ఆ ఉత్తరాలను బహిరంగపరిస్తే వాళ్లు వారి నియోజకవర్గాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. తమ ముసలితల్లిని ఏనాడూ పట్టించుకోని వాళ్లు ఈ రోజు ఆమె ఖాతాలో రూ.2.5 లక్షలు జమ చేస్తున్నారు అని మోదీ ఎద్దేవా చేశారు.
వ్యాపారులకు భరోసా కల్పించాం
-నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చటానికి చిన్నమోతాదుల్లో ఔషధాన్ని ఇస్తున్నా.
దేశం కోసం నేను నా గ్రామాన్ని, నా కుటుంబాన్ని వదిలేశాను. నల్లధనం, అవినీతిపై చేపట్టిన పోరాటంలో నాకు పేదలు, అనేకమంది తల్లుల ఆశీస్సులున్నాయి. ఈ పోరాటంలో ఈ ఆశీస్సులే చోదకశక్తిగా పని చేస్తున్నాయి.
-నల్లధనాన్ని పోగు చేసి పెట్టుకున్నవాళ్లు ఇప్పటికైనా నిర్దేశిత జరిమానా చెల్లించి ఆ సొమ్మును చట్టబద్ధం చేసుకోవాలి. ఇంకా వేచి చూద్దామని భావిస్తే… అది వాళ్లిష్టం. నా గురించి వారికి ఇంకా తెలియదు
-పెద్దనోట్ల రద్దు అంశంపై పది నెలలుగా అత్యంత రహస్యంగా సమీక్ష జరిపాం. ఒక చిన్న బృందాన్ని ఏర్పాటుచేశాం. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన లక్ష్యిత మెరుపుదాడుల్లాంటిది కాదిది. వివరాలు బయటకు పొక్కితే అవినీతిపరులు ముందుజాగ్రత్తపడి జారుకునే ప్రమాదం ఉంది.
-బొగ్గు, 2జీ తదితర కుంభకోణాలతో ప్రమేయమున్న వాళ్లు రూ.4,000 కోసం నేడు క్యూలో నించుంటున్నారు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి). కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతిపై ఎటువంటి పోరాటం చేయలేదు.