Site icon 123Nellore

ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచి దొంగలను పట్టుకున్న బాలాజీనగర్ పోలీసులు

నెల్లూరు నగర పరిధిలో అమాయక ప్రజలపై బెదిరింపులకు పాల్పడి దోచుకునే దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు నగరం ఉస్మాన్ సాహెబ్ పేటలో చిట్లూరు సతీష్ బాబు అనే వ్యక్తికి కొడవలూరు గ్రామానికి చెందిన వడ్ల దళారీ విజయ కుమార్ తో స్నేహం ఉంది. ఆ స్నేహం కారణంగా విజయ్ సతీష్ ను తన వద్ద ఉండే 10 లక్షల రూపాయల పాత నోట్లకు 8.5 లక్షల రూపాయల క్రొత్త నోట్లు ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆశపడిన సతీష్ ఆ నగదును తీసుకుని ఈ నెల 22 మధ్యాహ్నం బాలాజీ నగర్ బైపాస్ అవతలి పద్మావతి గ్రీన్ సిటీలో ఉండగా ముందుగా విజయకుమార్, తర్వాత మరో ఇద్దరు వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా ఆరుగురు వ్యక్తులు మోటార్ బైక్లలో వచ్చి పోలీసులమని చెప్పి మోసగించి సతీష్ వద్ద నున్న ఎనిమిదిన్నర లక్షలను తీసుకుని పెన్నా బ్రిడ్జి వరకు తీసుకొచ్చి మరో 20 వేలు కూడా తీసుకుని సతీష్ ని అక్కడే వదిలి పరారయినట్లు సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో నిఘా ఉంచి విచారణను చేపట్టిన పోలీసులు అల్లూరు మండలం గొల్లపాలెం కు చెందిన ఒట్టూరు మల్లికార్జున్, బోగోలు మండలం కప్పరాళ్ళతిప్పకు చెందిన సముద్రాల ఫిలప్, గుంజ ఏసోబు అలియాస్ అంటోని, పార్సు శీను, బచ్చు సుబ్బయ్య అను దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారి  నుండి ఏడున్నర లక్షల రూపాయలను రికవర్ చేయడం జరిగింది. తమ్మిశెట్టి హరి అనే దొంగ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ బి.శరత్ బాబు సూచనల మేరకు నగర డీఎస్పీ వెంకటరాముడు పర్యవేక్షణలో బాలాజీనగర్ పోలీసులు బృందంగా ఏర్పడ్డారు. ఈ బృందంలో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ భాస్కరయ్య, ఏఎస్ఐ బషీర్, కానిస్టేబుళ్ళు మాల్యాద్రి, సురేష్, రమేష్, మహబూబ్ బాషా ఉన్నారు. ఈ ప్రత్యేక బృందానికి ఎస్పీ రివార్డును అందజేసారు.

 
Exit mobile version