Site icon 123Nellore

ప్రజారోగ్య అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్లను ఇష్టానుసారంగా ధ్వంసం చేసి పనులు పూర్తైన తర్వాత రోడ్లను సరిదిద్దకుండా తమాషా చూస్తున్నారా అంటూ పబ్లిక్ హెల్త్ అధికారులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పరమేశ్వరి నగర్, పరమేశ్వరి అవెన్యూ, డమ్మాయి దిబ్బ ఎస్టీ కాలనీ, శివగిరి కాలనీల్లో బుధవారం ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో డ్రెయిన్లు అత్యంత నిర్లక్ష్యానికి గురవ్వడం గమనించిన కోటంరెడ్డి సంబంధిత అధికారులతో పరిష్కారం దిశగా చర్చించారు.
గతంలో కొత్తూరు పంచాయితీ పరిధిలోని ఈ ప్రాంతాలు నగరపాలక పరిధిలోకి విలీనం అయ్యాయని ఇంటి పన్నుల పేరుతో కార్పొరేషన్ అధికారులు స్థానికులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు అధికారులు పద్ధతి మార్చుకోకుంటే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత అని హెచ్చరించారు. 
సిమెంట్ రోడ్లు ధ్వంసం చేసిన కాంట్రాక్టర్ బాగు చేయకుండా వదిలేస్తే పబ్లిక్ హెల్త్ అధికారులు చోద్యం చూస్తున్నారా అంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. యుద్ధప్రాతిపదికిన చర్యలు చేపట్టి రోడ్లను బాగు చేయకుంటే పబ్లిక్ హెల్త్ కార్యాలయానికి తాళాలు వేస్తానని, అడ్డదిడ్డంగా జరుగుతున్న పనులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులను హెచ్చరించారు.

Exit mobile version