Site icon 123Nellore

పొర్లుకట్ట దుర్ఘటన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ న్యాయం జరపాలి: కాంగ్రెస్

నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట టపాసుల గోడౌన్ లో జరిగిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను నారాయణ హాస్పిటల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం నాడు పరామర్శించారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 31 న జరిగిన ఈ తీవ్ర దుర్ఘటనలో ఇప్పటికే 12 మంది మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న ముగ్గురూ త్వరితగతిన కోలు కోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ సంఘటన క్రమంలో ప్రభుత్వం తీరుని చూస్తుంటే ఈ పేద అమాయక గిరిజన కుటుంబాల పై వారికి చిత్తశుద్ది లేదనే విషయం బహిర్గతం అవుతున్నదని దుయ్యబట్టారు. చంద్రన్న భీమా క్రింద 150 రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల ప్రమాద భీమా ఉన్నదని ఇప్పుడు ప్రభుత్వం ఆ భీమా ని మరణించిన 12 మంది కుటుంబాలకు ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శించారు. గిరిజనుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణం ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రక్కా ఇళ్లు కేటాయించాలని లేనిచో కాంగ్రెస్ పార్టీ మౌన పోరాటాలకు సిద్ధపడుతుందని తెలిపారు. దేశ సరిహద్దులో ఉండే తీవ్రవాదుల వల్ల దేశానికి ముప్పు అయితే మన మధ్యే ఉంటూ అవినీతిలో కూరుకుపోయిన లంచగొండి అధికారుల మూలాన తీవ్రవాదానికి 100 రెట్లు ఎక్కువుగా దేశం నష్టపోతున్నదని, ఈ ఘటన కూడా అందులో భాగమేనన్నారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉడతా వెంకట్రావు, అధికార ప్రతినిథి రఘురామ్ లు మాట్లాడుతూ ఇంతటి తీవ్ర దుర్ఘటన జరిగి 6 రోజులు గడిచి 12 మంది గిరిజనులు మృతి చెందినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం, పరామర్శకు రాకపోవడం దారుణమన్నారు. గిరిజన సంక్షేమ శాఖామంత్రి పట్టించుకోకపోవడం హేయమైన చర్య అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యనారాయణ, కస్తూరయ్య, మురళి రెడ్డి, అల్లాబక్షు, కృష్ణా, మోషా, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version