పేదల ఇళ్ళు పగలగొడతాం అంటూ ప్రొక్లైనర్ లతో పోలీసు బలగాలను వెంటేసుకుని నీలగిరి సంఘం, ఫీడర్ కాలువ ప్రాంతాలకు వచ్చిన మునిసిపల్ అధికారులను నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. బాధితుల నుండి సమాచారం అందుకున్న వెంటనే వచ్చిన ఎమ్మెల్యే అధికారులతో వాగ్వాదానికి దిగారు. బాధితులు తమ ఇళ్ళు కాలువలకు, నీరు పోవడానికి అడ్డం లేకపోయినా తొలగిస్తున్నారని ఎమ్మెల్యే వద్ద భోరున విలపించారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఫీడెర్ కాలువ ప్రాంతంలోని పేదల ఇళ్ళు కాలువల్లో నీటి పారుదలకు అడ్డం లేకపోయినా అధికారులు తొలగించాలని చూడడం దారుణమన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గతంలో పంటల కోసం పంట కాలువలు ఉండేవని ఇప్పుడు నగరం విస్తరించిన దృష్ట్యా ఆ పంట కాలువలు అంతరించాయని కానీ ఆ కాలువలను ఇప్పుడు మున్సిపాల్టీ మురికి కాలువలుగా వాడుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. 100 ఏళ్ల క్రితం మ్యాపుల ఆధారంగా ప్రజల ఇళ్ళను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇలా పేదల కడుపు కొట్టే చర్యలకు పాల్పడి ఏమి సాధిస్తారని పేద ప్రజల ఉసురు తగలకుండా పోదని హితవు పలికారు. నీటి పారుదలకు అవసరం అనుకుంటే తొలగింపుకు తాము వ్యతిరేకం కాదని కానీ అవసరం లేని చోట కూడా తొలగించాలనడం దారుణమన్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఇళ్ళ కేటాయింపుల్లోనైనా ఎలాంటి ఇబ్బందులు, అక్రమాలు లేకుండా చూడాలని అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్సార్ సీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్ కాకుటూరు లక్ష్మీ సునంద, జిల్లా అధికార ప్రతినిథి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, మందా పెద్దబాబు, కడియంపాటి చిన్నా, కడియంపాటి వెంకయ్య, శివ, భాస్కర్, రాంబాబు, రమణయ్య, మొండెం చిన్నా తదితరులు పాల్గొన్నారు.