రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకొని జిల్లా ప్రభుత్వ వైద్యశాల లోని ప్రసూతి మరియు చిన్న పిల్లల వార్డులో రాత్రి బస చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేసారు. ఆసుపత్రులను, అక్కడి సదుపాయాలను సమీక్షించేందుకు వాటిల్లోనే తాను బస చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అదే విధంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మందుల కొరతపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వం 80 శాతం మందుల కోసం నిధులు వెచ్చిస్తుందని, మిగిలిన 20 శాతం ఆయా ఆసుపత్రులు భరించాలన్నారు. నెల్లూరు ఆసుపత్రిని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తానంటున్న మంత్రివర్యులు నెలకు 3.30 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మన పెద్దాసుపత్రిని ఏమాత్రం సంస్కరిస్తారో వేచి చూద్దాం.