విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధి సమాఖ్య ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని జిల్లా విద్యార్ధులు పలువురు ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులు జొన్నలగడ్డ సుధీర్, గంగిరెడ్డి లు మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా విక్రమ సింహపురి యూనివర్సిటీ కి సంబంధించి జరుగుతున్న వ్యవహారాలు, ఇక్కడ కొనసాగుతున్న అవినీతి అక్రమాలు, రిజిస్ట్రార్ శివశంకర్ అరాచకాలు లోకానికి తెలియనివి కావన్నారు. వర్శిటీ పై జిల్లా ప్రజల్లో ఏహ్యభావం కలిగే విధంగా మార్చేసారు ఇక్కడి అధికారులు అని తెలిపారు. ఇక్కడ జరిగే అనేక అక్రమాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ధర్నాలు, దీక్షలతో విద్యార్ధి సంఘాల వారు, విద్యార్ధులు ఎంతో కాలంగా పోరాడుతున్నా, అధికారుల తీరుకి వర్శిటీ పరిధిలోని అనేక మంది విద్యార్ధులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా, ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు పతాక శీర్షికలతో, ఆధారాలతో పాటు పత్రికల్లో వచ్చినా కూడా ప్రభుత్వం కనీస విచారణలు కాని దర్యాప్తు కాని జరపలేదన్నారు. ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోయే విధంగా ఇక్కడి అధికారుల తీరు ఉందని తెలిపారు. బోధన, బోధనేతర నియామకాల అక్రమాలు, వర్శిటీ భవన నిర్మాణాల్లో అక్రమాలు, రిజిస్ట్రార్ శివశంకర్ అరాచకాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాల్లో అక్రమాలు, విద్యార్ధులు ఆత్మహత్యాయత్నాలు చేసుకునే స్థాయిలో వేధింపులు, ఆఖరికి విద్యార్ధులకు హాస్టల్లో పెట్టే భోజన బిల్లుల్లో సైతం అక్రమాలు ఇలా అనేక వ్యవహారాలపై విద్యార్ధులు మాట్లాడారు. ప్రభుత్వ పట్టించుకోని తీరుని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తోనే పాదయాత్ర:
“యువకులు పోరాడకుంటే అవినీతి అక్రమాలు నశించవు. రోడ్డెక్కి పోరాడండి. మీ పోరాటంలో నేను భాగం అవుతాను.” అని ఇటీవల ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని పాదయాత్ర చేపడుతున్నట్లు విద్యార్ధులు స్పష్టం చేశారు. ఉద్ధానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యలు, పోలవరం రైతుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలు వంటి అనేక విషయాల పై ప్రభుత్వం నుండి పరిష్కారం పొందేలా తనదైన శైలిలో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని ప్రజా నాయకుడిగా గుర్తించి విద్యార్ధులుగా యూనివర్సిటీలో ఉన్న సమస్యలు, అవినీతి అక్రమాలు రూపుమాపాలని కోరుతూ ఆయన దృష్టికి తీసుకెళ్లదలచామని విద్యార్ధులు తెలిపారు.
రిజిస్ట్రార్ శివశంకర్ అక్రమాలు, అరాచకాలకు అండదండలు అందిస్తున్న ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరు?:
2014 డిసెంబర్ నుండి 2016 మార్చి నెల వరకు 14 నెలల పాటు ఇంచార్జ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్ శివశంకర్ అక్రమాలను పక్కకు నెట్టేస్తూ ఆయన్నే రెగ్యులర్ రిజిస్ట్రార్ గా ప్రభుత్వం ఎందుకు నియమించిందని విద్యార్ధులు ప్రశ్నించారు. ఈ సంవత్సర కాలంలో వర్శిటీ లో జరిగిన అరాచకాలు అందరికీ తెలిసినవేనని అన్నారు. విద్యార్ధులకు బోధనా ఇబ్బందులు కల్గించారన్నారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ లో లేని విధంగా విద్యార్ధుల భోజనం లో కక్కుర్తి పడి అత్యధిక బిల్లులు వేసి విద్యార్ధులు కట్టలేదని హాస్టల్ మెస్ లను మూసేసి విద్యార్ధులను ఆకలితో అలమటించేలా చేశారన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. పలువురిని కక్షపూరితంగా విధుల్లో నుండి తొలగించారన్నారు. వర్శిటీలో కోర్సుల్లో విద్యార్ధులు చేరకుండా, చేరినా పాఠాలు చెప్పకుండా మూతపడేలా వర్శిటీ కళాశాలను తీర్చిదిద్దారన్నారు. ఇంత జరుగుతున్నా ఆయన్ని ప్రభుత్వం తొలగించకుండా అక్రమాలకు ఎందుకు అండదండలు అందిస్తున్నదని విద్యార్ధులు ప్రశ్నించారు. ఆయన అవినీతి వెనుకున్న ఆ ప్రభుత్వ పెద్దలు ఎవరని విద్యార్ధులు ప్రశ్నించారు.
యూనివర్సిటీ సమస్యను నాయకులు చిన్నది చేసి చూస్తున్నారు:
ఒక యూనివర్సిటీ సమస్య ఇదేదో చిన్న సమస్య అని పలువురిలో భావన ఉంటుందని, నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధుల్లో కూడా అలాంటి భావనే ఉందేమో అనే అనుమానాన్ని విద్యార్ధులు వ్యక్తం చేశారు. యూనివర్సిటీ మొత్తం జిల్లా విద్యా వ్యవస్థను సూచిస్తుందని ప్రతిఒక్కరు గుర్తించాలని, తమ సమస్య చిన్నది కాదని, గత కొన్నాళ్లుగా చాలా తీవ్రంగా తయారైందని తెలిపారు. ఆ తీవ్రత గుర్తించాలనే నెల్లూరు నుండి హైదరాబాద్ వరకు పవన్ కళ్యాణ్ గారిని కలిసేంత వరకు పాదయాత్ర ను చేపట్టబోతున్నాం అని తెలియజేసారు.
పాదయాత్ర సాగేదిలా:
ఫిబ్రవరి 22 బుధవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం నుండి విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ గారి ఆశీస్సులు తీసుకుని పాదయాత్ర ప్రారంభం అవుతుందని విద్యార్ధులు తెలియజేసారు. మార్గమధ్యంలో గాంధీ బొమ్మ వద్ద గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు. రోజుకి నడవగలిగినన్ని కిలోమీటర్లు నడుస్తూ రాత్రిళ్ళు విశ్రాంతిని ఏదైనా బడిలోనో, గుడిలోనో తీసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తామని విద్యార్ధులు తెలిపారు. పాదయాత్ర యావత్తు అత్యంత శాంతియుతంగా నిర్వహిస్తామని విద్యార్ధులు తెలిపారు.
రాజకీయాలకు అతీతం:
తాము ఏ రాజకీయ పార్టీకి సంబంధించినవారము కాదని విద్యార్ధులు తెలియజేసారు. పవన్ కళ్యాణ్ లోని కార్యదక్షతను గుర్తించి ఆయన వివిధ సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా నిలబడుతున్న విధానాన్ని చూసి తమ సమస్యలను సైతం ఆయన వద్దకు తీసుకెళ్తున్నామని విద్యార్ధులు స్పష్టం చేశారు. వర్శిటీ అక్రమాలను రూపుమాపడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నాం అని తెలిపారు. తమ పోరాటానికి పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రజలు మద్దతునిస్తారని ఆశిస్తున్నామని విద్యార్ధులు తెలిపారు. పవన్ కళ్యాణ్ స్పందించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వర్శిటీ లో అవినీతి అక్రమాలపై దర్యాప్తులు జరిపించి అక్రమాలు రూపుమాపేలా చేస్తారని ఆశిస్తున్నామని విద్యార్ధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధులు సుధీర్, గంగిరెడ్డి, శ్రీనివాసులు, రమణ, శ్రీకాంత్, కిరణ్, శ్రావణ్, హేమంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
14.442598779.986456