నోట్లు రద్దు చేసి ప్రత్యామ్నాయం లేకుండా ప్రజలందరూ ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పడాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్షాలు పిలుపిచ్చిన భారత్ బంద్ లో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని అమలుపరచేటప్పుడు పకడ్బందీ వ్యూహం లేకుండా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలు ఇబ్బందులు పడడమే సమంజసంగా లేదని తెలిపారు. బ్లాక్ మనీ ఉన్నవాళ్లు అక్రమ మార్గాల్లో తమ నల్ల ధనాన్ని వైట్ గా మార్చుకుంటున్నారని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని తెలియజేసారు. మరోప్రక్క పేద ప్రజలు, మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇలా ఒకరని తేడా లేకుండా అందరూ తమ పనులు మానుకుని బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలని కోరారు.