Site icon 123Nellore

నెల్లూరు యూనివర్సిటీ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న పవన్ కళ్యాణ్

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో అవినీతి, అక్రమాలు, అరాచకాలు, వేధింపుల పై ఎన్ని పోరాటాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రస్తుతం రాష్ట్రంలో అనేక సమస్యల పై పరిష్కారం దిశగా పోరాడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ సమస్య పరిష్కారం దిశగా సహకారం అందించాలని కోరుతూ ఫిబ్రవరి 22 న నెల్లూరు నగరంలో విద్యార్ధులు నెల్లూరు నుండి పవన్ కళ్యాణ్ వద్దకు పాదయాత్ర ప్రారంభించారు. 8 రోజులకు విజయవాడకు చేరిన విద్యార్ధులు అస్వస్థత చెందుతున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పాదయాత్ర ను ఆపి హైదరాబాద్ కు రమ్మని విద్యార్ధులకు కబురు పంపారు.
హైదరాబాద్ చేరుకున్న విద్యార్ధులకు వాహనాలను పంపి రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో జరుగుతున్న కాటమరాయుడు షూటింగ్ వద్దకు జనసేన నాయకులు తీసుకెళ్ళారు. షూటింగ్ ను మధ్యలో ఆపి పవన్ కళ్యాణ్ గారు సుమారు 45 నిముషాలు విద్యార్ధులతో చర్చించారు. చుట్టుపక్కల విశ్రాంతి ప్రదేశం లేకపోవడంతో మండుటెండలోనే విద్యార్ధులతో భేటీ అయ్యారు. విద్యార్ధుల పాదయాత్ర తనను కలచి వేసిందని తెలిపారు. ఇకమీదట ఏదైనా సమస్య ఉంటే నేరుగా జనసేన కార్యాలయంలో అందజేస్తే తాను తప్పక స్పందిస్తానని ఆరోగ్యం పాడుచేసుకోవద్దని కోరారు.
విద్యార్ధులు వర్శిటీ లో నాసిరకంగా నిర్మాణం అయిన భవనాలు, బోధన, బోధనేతర నియామకాల్లో జరిగిన అక్రమాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనాల్లో జరిగిన అక్రమాలు, తరగతులు, హాస్టళ్ళ దుస్థితి, వర్శిటీ లో అంతర్గత రాజకీయాలు, ప్రశ్నించే వారిపై కక్షపూరిత చర్యలు, రిజిస్ట్రార్ శివశంకర్ అరాచక చర్యలు తదితర విషయాలను పవన్ కళ్యాణ్ గారికి వివరించి పుస్తక రూపంలో వారు రూపొందించిన వినతిని ఆయనకు అందజేసారు.
పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ విద్యార్ధులు అందజేసిన వినతిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని తెల్పారు. విద్యార్ధులకు ఎంతో కష్టం వస్తేనే ఇలాంటి పాదయాత్ర వంటి సాహస చర్యకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మానవవనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడి అక్రమాల పై నిజనిర్ధారణ కమిటీ వేసి అక్రమాల పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. విద్యార్ధులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని త్వరలో నెల్లూరు వచ్చిన సందర్భంలో వారిని కలుస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో పాదయాత్ర చేసిన విద్యార్ధులు జొన్నలగడ్డ సుధీర్, మల్లి శ్రీకాంత్ యాదవ్, కె.గంగిరెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాసులు, ఆవులయ్య, వినయ్, రాజేష్, గణేష్, సాయి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు టోని అక్కడకు చేరుకొని సంఘీభావం తెలిపారు.

Exit mobile version