“ప్రజలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నాం. దేశంలో మన రాష్ట్రం వెలిగిపోతోంది.” ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేల నుండి ప్రతి ఒక్క అధికార పార్టీ నాయకుడు చెప్పే మాట. ఇటీవల అనేక సమావేశాల్లో రాష్ట్రంలో అసలు కరెంటు కోతలే లేవనే ప్రచారాన్ని పదే పదే చేస్తున్నారు. కానీ ఆచరణలో చూస్తే ఆ మాటలు ఆమడ దూరంలో ఉంటున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే నెల్లూరు నగరంలో గత వారం రోజులుగా వివిధ ప్రాంతాలలో విస్తృతంగా ఉంటున్న కరెంటు కోతలే. ఉదయం తీసే కరెంటును మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇవ్వట్లేదు అనేక ప్రాంతాల్లో. ఒక్కోసారి సాయంత్రం పూట కూడా విద్యుత్ అధికారులు తమ ఇష్టానుసారం కరెంటుకు కోత పెడుతుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖాధికారులు ఒక్కో రోజు మరమ్మత్తుల కారణంగా కరెంటు ఉండదని ప్రకటన ఇస్తున్నారు కానీ కొన్ని రోజులు అసలు ప్రకటనే లేకుండా అప్రకటిత కరెంటు కోతలను విధిస్తున్నారు. ఇది మరమ్మత్తుల కోసమా లేక ప్రభుత్వ పొదుపు సూత్రమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. 24 గంటల కరెంటు అంటూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్న ప్రభుత్వ చర్యలు ప్రజలకు విస్తుగొల్పేలా ఉన్నాయి. నగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక పల్లెల్లో పరిస్థితి ఏంటోనని నెల్లూరు నగర ప్రజలు చర్చించుకుంటున్నారు.