జనసేన పార్టీ విధివిధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే బలమైన కాంక్షతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు తలపెట్టిన “పల్లె పల్లెకు జనసేన” కార్యక్రమం నేడు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామం నుండి ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం నుండి సుమారు 200 మంది జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.
విడవలూరు మండలం పార్లపల్లి గ్రామం నందు ప్రారంభం అయి విడవలూరు మండలం లో ప్రజానీకంతో జనసేన పార్టీ కార్యకర్తలు మమేకమయ్యారు. కార్యక్రమం సందర్భంగా రూపొందించిన కరపత్రాన్ని ఇంటింటికీ పంచుతూ జనసేన పార్టీ మూడున్నరేళ్ళ ప్రస్థానాన్ని తెలిపారు.
పల్లె పల్లెకు జనసేన లో పాల్గొన్న కార్యకర్తలు తొలుతగా గ్రామ పరిసరాల్లో ఇంటింటికీ కరపత్రాన్ని పంచి తదుపరి ప్రభుత్వ పాఠశాలను, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో వసతులను పరిశీలించిన కార్యకర్తలు సంతృప్తిని వ్యక్తపరచారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం స్థితిని చూసి తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. పురుగులు పట్టిన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేయడం మూలాన విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందడం లేదని కార్యకర్తలు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని విద్యార్ధులకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్త రాజా యాదవ్ మాట్లాడుతూ నేటి సమాజంలో సమకాలీన రాజకీయ పరిస్థితులను గమనిస్తే ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమయ్యే అంశం ఇప్పుడున్న ప్రధాన పార్టీల ముఖ్య అజెండా అధికారం సాధించడమే అని అన్నారు. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం అధినేతలు కేవలం ముఖ్యమంత్రి కుర్చీ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నారు తప్పించి ప్రజా సమస్యల అధ్యయనం, పరిష్కారం దిశగా తీసుకుంటున్న చర్యలు శూన్యం అని విమర్శించారు. అధికారంలో ఉంటూ స్వలాభాలను చూసుకోవడం, బంధుప్రీతి, అయిన వారికి మరియు అనర్హులకు మంత్రి పదవులు మరియు ఉన్నత పదవుల కల్పన వంటివే మనం చాన్నాళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం అని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో సాంప్రదాయ రాజకీయాలకు, అజెండాలకు భిన్నంగా తనకు అధికారం ముఖ్యం కాదని స్పష్టం చేస్తూ పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం అంటూ నూతన రాజకీయ ఒరవడికి జనసేన పార్టీ ద్వారా తమ నాయకులు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారన్నారు. మూడున్నరేళ్ళ క్రితం పార్టీ ప్రారంభం సందర్భంగా చేసిన ప్రసంగానికి అనుగుణంగా, తదుపరి ఎన్నికల క్షేత్రంలో మిత్ర పక్షాలతో కలిసి చేసిన వాగ్ధానాలకు అనుగుణంగా ఇచ్చిన మాటను తప్పకుండా ఎప్పటికప్పుడు ప్రశ్నలను సందిస్తూ ప్రజా సమస్యలను పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తున్నారు అని తెలిపారు.
గత మూడున్నరేళ్ళ కాలంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నట్లు ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార మార్గాలను చూపకుండా తాము ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు తీరుతాయని ప్రజల్ని ఏమారుస్తున్నారు అని విమర్శించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకునిగా ప్రజలందరికీ నేడు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారని తెలిపారు. అటు శ్రీకాకుళం ఉద్ధానం కిడ్నీ వ్యాధి బాధితుల సమస్య, తూర్పుగోదావరి జిల్లాలోని ఆక్వా పార్క్ సమస్య, అమరావతి రైతాంగ సమస్య నుండి మన జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ విద్యార్ధుల సమస్య వరకు ప్రజలకు పరిష్కార మార్గం చూపిన నాయకులు పవన్ కళ్యాణ్ అని తెలిపారు.
అసెంబ్లీలో ప్రజల తరపున తమ గళం వినిపించాల్సిన ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టి రాజకీయాలు నడుపుతుంటే రాష్ట్రంలో నేడు ప్రజలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారని అందుకే ఆయన వద్దకు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తున్నారని తెలిపారు. అందుకు తాజా నిదర్శనం గత కొన్నేళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్ధుల నుండి కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు, రైతుల వరకు అందరు జనసేన బాట పట్టారన్నారు.
రాష్ట్రంలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపా ద్వారా సాధ్యం కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా జనసేన పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారని తెలిపారు.
మన దేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలని అలాంటి గ్రామాలు నేడు రాజకీయాల కారణంగా తమ ఉనికిని కోల్పోతున్నాయని తెలిపారు. జనసేన పార్టీ నిర్మాణంలో గ్రామాల లోని యువత పాత్ర కీలకం అని తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే లక్ష్యంగా ఎదురుచూస్తున్న గ్రామ ప్రజానీకానికి ఈ కార్యక్రమం ద్వారా సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు.
జనసేన పార్టీ విధివిధానాలను, మూడున్నరేళ్ల పార్టీ ప్రస్థానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం తమ ముఖ్య ధ్యేయమన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను అధ్యయనం చేస్తామన్నారు. గ్రామాల్లో పార్టీ పట్ల ఆసక్తిగా ఉన్న యువతను, నూతన కార్యకర్తలను ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి అనుసంధానం చేస్తామన్నారు.
మండలాల్లో విద్య, వైద్యం, రైతాంగ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి నివేదికలను రూపొందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతాప్ గౌడ్, ఆనంద్ గౌడ్, కిరణ్ కుమార్, విక్రమ్ కుమార్, సుభాష్, సుధీర్, రాము, శరత్, చిన్నా జనసేన విద్యార్ధి కార్యకర్తలు ఆషిక్, చరణ్, వెంకట్, వంశీ, సుమంత్ మహిళా కార్యకర్తలు నాగరత్న, ఇందిర తదితరులు పాల్గొన్నారు.