ప్రజల్లో నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పిస్తూ జిల్లాలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార వ్యవహారాల్లో నగదు రహిత విధానం విస్తృత మయ్యేలా అన్ని వ్యాపార సంస్థలకు డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు అందజేసేలా బ్యాంకుల అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో పలు బ్యాంకుల అధికారులు, వాణిజ్య సంస్థలు, రైల్వే, ఆర్టీసీ, గ్యాస్, ఆయిల్, మార్కెటింగ్ ఏజెన్సీల నిర్వాహకులతో పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పాస్ మెషీన్ల ద్వారా పోస్టాఫీసులు, రైల్వే స్టేషన్ లు, రేషన్ షాపులు, మీ సేవ కేంద్రాలు తదితర వాటిల్లో నగదు రహిత నిర్వహణ జరిగేలా చూడాలన్నారు. దేవాలయాల్లో వచ్చే నగదును ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమచేసేలా జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు ఎరువులు, విత్తనాల కొనుగోలుకు నగదు సమస్య తలెత్తకుండా వారి ఖాతాల నుండి తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని బ్యాంకు అధికారులకు సూచించారు. రేషన్ షాపులు, మీసేవ కేంద్రాల్లో సైతం కాష్ లెస్ విధానాల కోసం బ్యాంకుల అధికారులు సహకరించాలని కోరారు. మైక్రో ఏటీఎంల పై దృష్టి పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ ఇంతియాజ్, ఏజేసీ రాజ్ కుమార్, ఎఎస్పీ శరత్ బాబు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య సంస్థల ప్రతినిథులు పాల్గొన్నారు.