వచ్చే నెల 11వ తారీఖున నెల్లూరు వీఆర్సీ మైదానంలో కుమ్మర్ల ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ కుమ్మర యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెళ్లూరు సుమన్ తెలియజేసారు. ఆ మహాసభకు సంబంధించిన గోడప్రతులను ఆదివారం కొండాయపాళెం గేటు వద్ద గల అంబేద్కర్ భవన్ లో విడుదల చేసారు. ఆయన మాట్లాడుతూ చక్రాన్ని కనుగొని ప్రపంచానికి నాగరికత నేర్పిన కుమ్మర్లు నేడు సామాజికంగా, ఆర్థికంగా ఎంతగానో వెనుకబడి ఉన్నారని తెలిపారు. కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని అలాంటివారిని ఉచితంగా మందులిచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. డిగ్రీ పూర్తి చేసుకున్న కుమ్మరి యువతకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువసేన జిల్లా అధ్యక్షులు ఉదయగిరి మనోహర్, ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపీచంద్, నాయకులు శ్రీహరి రావు, ప్రభాకర్, శ్రీనివాసులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.