నెల్లూరు నగరంలోని ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిబంధనలు అతిక్రమించిన వాహనాల విషయంలో ఈ చలానా విధానం అమల్లో ఉందని ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా వాహనదారులు తక్షణం చెల్లించాలని లేని ఎడల వాహనాన్ని సీజ్ చేసి న్యాయస్థానానికి సమర్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మంగళవారం స్పష్టం చేశారు.
నో పార్కింగ్ ప్రదేశాల్లోవాహనాలు పార్క్ చేసినట్లు అయితే ఆ వాహనాలను క్రేన్ల ద్వారా తొలగించి భారీగా జరిమానా విధించబడును అని ఆయన తెలిపారు. నగరంలో నిర్దేశించిన వన్ వే మార్గాలను అతిక్రమించిన విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో పాటు సీసీ కెమెరా రికార్డుల ద్వారా కూడా జరిమానా విధించి ఈ-చలానా పంపబడును అని తెలియజేసారు.
నగర పరిధిలో రిజిస్ట్రేషన్ లేని ఆటోలు నగరంలోకి ప్రవేశించకూడదని అలా ప్రవేశిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలను క్రమం తప్పకుండా పాటించి పోలీసులకు సహకరించాల్సిందిగా ఎస్పీ కోరారు.