Site icon 123Nellore

జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన SFI – విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా – పరిస్థితులు ఉద్రిక్తం

వారంతా SFI విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు. ఇటీవల తమ సంస్థ ఆధ్వర్యంలో జీపు జాతా పేరుతో జిల్లాలోని అన్ని కేంద్రాలను సందర్శించారు. పాఠశాలలను చూశారు, కళాశాలలను చూశారు, హాస్టళ్లలో నిద్ర చేసి విద్యార్థుల సమస్యలను క్షుణ్ణంగా వ్రాసుకున్నారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపై అధ్యయనం చేసి వాటిని ప్రజానీకం దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు. అందులో భాగంగా శుక్రవారం నాడు నెల్లూరు నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను కలెక్టర్ ముత్యాలరాజుకి విన్నవించే ఏర్పాట్లు చేసారు. ర్యాలీ గా వస్తున్న SFI బృందాన్ని కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో SFI వారు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 
 ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్షులు నాయుడు రవి మాట్లాడుతూ జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో వసతులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు. పారిశుద్ధ్యం మెరుగుపరచి మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్సుమెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యేల, మంత్రుల వేతనాలు పెరుగుతున్నాయి కానీ విద్యార్థుల మెస్ చార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, స్కాలర్ షిప్పులు పెరగటం లేదని తక్షణం పెంపుదల చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పాటు చేయాలనీ సంవత్సరం క్రితం పూర్తై సిద్ధంగా ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ స్వంత భవనాల్లోకి వర్శిటీ కళాశాలను తక్షణం తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. 
 ధర్నా నిర్వహిస్తున్న SFI విద్యార్థులను పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి ఎం.వి.రమణ, నగర కార్యదర్శి నంద కిరణ్, నాయకులు శ్రీను, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version