కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీ తీరు అభినందనీయంగా ఉందని, ఆ పార్టీకి కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపితే బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ఆయన స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. నల్లధనం పై యుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా గంగాధరం సమర్ధించారు. అయితే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం చేస్తున్న పోరాటాన్ని ఆయన తప్పుపట్టారు. పది సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీసీల్లోని ఇతర కులాలకు ఇబ్బందులు తలెత్తకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసారు.