Site icon 123Nellore

చేసిన మంచి వృథా పోదనే విషయం ఎమ్మెల్యే అనిల్ విషయంలో మరోసారి స్పష్టం అయింది

చేసిన మంచి ఊరికే పోదు, అది ఎప్పుడోకప్పుడు  మనకు మంచే చేస్తుందన్నది ఒక నానుడి. 

ఇప్పుడలాంటి సంఘటన మన నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ విషయంలో స్పష్టం అయింది. ఆయన గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చేసిన ప్రసంగం ఇప్పుడు ఈ రాష్ట్రంలోని యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ సంవత్సరం మార్చి 29 న అసెంబ్లీ లో ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థ గురించి తన అభిప్రాయాలను తెలియజేసిన ఎమ్మెల్యే ప్రసంగాన్ని అప్పట్లో పెద్దగా పట్టించుకున్న వారు లేరు. కానీ ఇప్పుడు అదే ప్రసంగాన్ని గత కొద్ది రోజులుగా అనేక మంది విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా యువతరం తమ ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక అనుసంధాన వెబ్ సైట్ లలో ఆ ప్రసంగాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ “ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే చాలు మన రాష్ట్రం లో అనేక వ్యవస్థలు బాగుపడతాయి” అని విశేషంగా కొనియాడుతున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో యువత ఈయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అనిల్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.
“గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి మనం మన పిల్లలను ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చగలమా, నేనైతే చేర్చలేను” అంటూ గత అనేక సంవత్సరాలుగా పాడైపోయిన విద్యా వ్యవస్థపై అనిల్ చేసిన ప్రసంగంలోని నిజాయితీ అనేకమందిని విశేషంగా ఆకట్టుకుంటున్నది.
“పార్టీలకు అతీతంగా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా” అని అనిల్ చేసిన ప్రసంగం అందర్నీ విశేషంగా ఆకట్టుకోగా ఈ ప్రసంగం వెనుక అనిల్ కుమార్ యాదవ్ వ్యక్తిగతంగా అభిమానించే పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ఉన్నదని తెలియవస్తున్నది.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో యాక్టివ్ కాక మునుపు నుంచే పవన్ కళ్యాణ్ కు అభిమాని. తన అభిమానాన్ని బహిరంగంగా అనేక మార్లు ప్రదర్శించారు కూడా.
రాజకీయాల్లో ఓ సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో తనకు ఎంతో అండగా నిలిచి ఎమ్మెల్యే గా అవకాశం కల్పించిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత జగన్ పట్ల ఎంతో విధేయతతో మెలుగుతారు అనిల్. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూనే ఉన్నారు అనిల్. పవన్ కళ్యాణ్ వేరే పార్టీ పెట్టిన స్థితిలో పవన్ ను అమితంగా ఇష్టపడే అనిల్ ఆ పార్టీ వైపు మొగ్గుతారని పలువురు భావించినా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ని వీడే ఆలోచనే తనకు లేదని, పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఉన్నది అభిమానమేనని తన సన్నిహితులకు స్పష్టం చేశారు ఎమ్మెల్యే అనిల్.
పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఆయన భావజాలం అనిల్ కుమార్ యాదవ్ పై అధికంగా ఉన్నదన్నది సుస్పష్టం. అనిల్ కుమార్ యాదవ్ సైతం పవన్ కళ్యాణ్ తరహాలో అనేక సామాజిక అంశాల పై అవగాహన కలిగి ఉన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్లు, వ్యవస్థలో వేళ్ళూనుకుని పోయిన అనేక రుగ్మతల గురించి అనిల్ అధ్యయనం చేసారు. 
ఆ స్ఫూర్తి తోనే విద్యా వ్యవస్థపై తన అభిప్రాయాలను అనిల్ అసెంబ్లీ లో పార్టీలకు అతీతంగా మాట్లాడారనే ఊహాగానాలు సైతం ఉన్నాయి. అనిల్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ కు స్ఫూర్తి అయిన చెగువేరా గురించిన ప్రస్తావన సైతం తీసుకొచ్చారు.
2019 ఎన్నికల్లో జన సేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన పవన్ కళ్యాణ్ నెల్లూరు నగర నియోజకవర్గంలో తన అభిమాని అనిల్ పై ప్రత్యక్షంగా తమ పార్టీ కాకుండా తమతో పొత్తులో ఉండే పార్టీకి ఆ స్థానాన్ని వదిలేయొచ్చు అనే ఊహాగానాలు సైతం ఉన్నాయి.
ఏదేమైనా నెల్లూరు నగర నియోజక వర్గంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీలో రానున్న ఎన్నికల్లో సీటు కోసం ఆ పార్టీ నగర ఇన్ ఛార్జ్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఆనం వర్గం నుండి ఏసీ సుబ్బారెడ్డి, రంగమయూర్ రెడ్డి ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎప్పటికప్పుడు ప్రజాదరణను అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గత ఎన్నికల్లో కంటే కూడా ఎక్కువ మెజారిటీ తో అనిల్ గెలుస్తారని పలు ప్రజాభిప్రాయ సర్వేల్లో వెల్లడవుతూ ఉన్నది.
  
Exit mobile version