Site icon 123Nellore

ఇప్పుడున్న 500 రూపాయల మరియు 1000 రూపాయల నోట్లు ఇక చెల్లవు: కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం

 నల్లధనం నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. మంగళవారం అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. డిసెంబరు 30లోగా రూ.500, రూ.1000నోట్లు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 11 వరకు వైద్యసేవలు, రైలు టికెట్ల కోసం రూ.500, రూ.1000 నోట్లు వినియోగించుకోవచ్చని ప్రధాని వెల్లడించారు. దిల్లీ నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. డిసెంబరు 30లోపు డిపాజిట్‌ చేయనివారు.. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డిపాజిట్‌ చేయవచ్చని తెలిపారు. రేపు బ్యాంకుల్లో వినియోగదారుల సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఏటీఎంలు కూడా పనిచేయవని పేర్కొన్నారు.
 

‘‘నల్లధనం, అవినీతి కబంధ హస్తాల్లో దేశం చిక్కుకుపోయింది. అధికార దుర్వినియోగంతో అనేకమంది భారీ సంపద కూడగట్టారు..నిజాయతీ పరులు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సాధారణ పౌరుడు అత్యంత నిజాయితీతో జీవిస్తున్నాడు.. అధికారం అనుపానులు తెలిసినవాళ్లే అవినీతికి పాల్పడతున్నారు. ఉగ్రవాద సంస్థలు రూ.500, రూ.1000 దొంగనోట్లను చెలామణి చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి. అవినీతిపరుల ఆటకట్టించేందుకు బినామీ ఆస్తుల చట్టాన్ని తీసుకొచ్చాం. సబ్‌ కా సాథ్‌- సబ్‌ కా వికాస్‌’’ అన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

Exit mobile version