500 మరియు 1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాలో ప్రజల బ్యాంకింగ్ కష్టాలు పెరిగిపోయాయి. పాత నోట్లను మార్చుకోవడమే, డిపాజిట్ చేసి విత్ డ్రా చేసుకుందామో అని అనుకునే వారికి బ్యాంకుల్లో తగినంత కరెన్సీ లేక సతమతమవుతున్నారు. ఈ పది రోజుల్లో జిల్లాలో 3500 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ లు కాగా కేవలం 500 కోట్ల రూపాయల వరకే విత్ డ్రా అయ్యాయి. జిల్లాకు 500 కోట్ల రూపాయల పంపిణీ కోసం రాగా అందులో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ లే చెరో 200 కోట్ల రూపాయలు తీసుకున్నాయి. కేవలం 100 కోట్ల రూపాయల మేరకే మిగిలిన బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు రావడంతో పలు బ్యాంకుల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని కీలక అవసరాల కోసం 50 కోట్ల రూపాయల మేర ఎస్బీఐ హోల్డింగ్ లో ఉంచినట్లు సమాచారం. స్టేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్ మినహా మిగిలిన బ్యాంకులకు రానున్న మూడు రోజులు ఇబ్బందులు తప్పవు. ఈ నెల 24 వరకు కొత్త నోట్లు జారీ కావని, ప్రస్తుతం ఉన్న సొమ్మునే పొదుపుగా వాడుకోవాలని, ప్రజలకు పంపిణీ చేయాలని సోమవారం సాయంత్రం బ్యాంకులకు సమాచారం అందింది. అవసరమైతే సమీపంలోని ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్ లను సంప్రదించి సొమ్మును సర్దుబాటు చేసుకోవాలని మిగిలిన బ్యాంకులకు అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా బ్యాంకుల్లో క్యాషియర్ ల నుండి మేనేజర్ ల వరకు ఎవ్వరైనా కమీషన్ పద్ధతిలో నోట్ల మార్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని బ్యాంకుల యాజమాన్యాలు తమ ఉద్యోగులకు తేల్చిచెప్పాయి.