ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నిక కానున్నట్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది. ప్రస్తుత చైర్మన్ చక్రపాణి పదవీ కాలం మార్చికి ముగియనుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలిసింది. మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమిరెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇచ్చేందకు పార్టీ నాయకత్వం సూత్రపాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. అయితే, తనకున్న అనుభవం దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలోకి తనను తీసుకోవాలని సోమిరెడ్డి కోరుతున్నా, చంద్రబాబు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఛైర్మన్ స్థానానికి దూకుడుగా వ్యవహరించే సోమిరెడ్డే సరైన వ్యక్తి అని భావిస్తున్నారు. సోమిరెడ్డికి చైర్మన్ పదవి ఇస్తే గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.