నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జయవర్ధన్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు కి వినతి పత్రం అందజేసారు.
ఈ సందర్భంగా జయవర్ధన్ మాట్లాడుతూ 7 సంవత్సరాల క్రితం ఏర్పాటైన నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లోకి మాత్రం నోచుకోవడం లేదన్నారు. ఈ చట్టం ప్రకారం 25% సీట్లను పేద విద్యార్ధులకు ప్రతి కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాల వారు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా అలా జరక్కుండా Olympiad, Spark, Alpha లంటూ విచిత్రమైన పేర్లు పెట్టుకుని లక్షలాది రూపాయలను నిబంధనలకి విరుద్ధంగా దోచుకుంటున్నాయి అని అన్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఎత్తేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇలా చేస్తే మెరుగైన విద్య పేదలకు ఎలా అందుతుందని ప్రశ్నించారు. విద్యా హక్కు చట్టం అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
వైసీపీ విద్యార్ధి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసే నీచమైన ఆలోచనలు చేస్తున్నారన్నారు. విద్యా హక్కు చట్టం అమలు చేయకపోతే విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచలనాయుడు, నగర అధ్యక్షులు శేషసాయి, విద్యార్ధి నాయకులు మధు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.