500 మరియు 1000 రూపాయల రద్దు నేపథ్యంలో పలువురు లెక్కల్లేకుండా తమ వద్ద పెద్ద నోట్ల రూపంలో ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు అనేక ఏర్పాట్లు చేసారు. బంగారు కొనుగోలు, షాపింగ్ మాల్స్ కి పరుగులు, పెట్టుబడుల వైపు మొగ్గు చూపిన పలువురికి కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో ఆశలు అడియాసలు అయ్యాయి. తాజాగా వెలుగుచూస్తున్న వ్యవహారం ఏంటంటే పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత నగరంలోని పలువురు వ్యాపారులు తమ నల్ల ధనాన్ని తెల్లగా చేసుకునే అవకాశాలు సన్నగిల్లడంతో భారీ స్థాయిలో మొబైల్ రీఛార్జ్ లోడింగ్ చేసుకున్నారట. సాధారణంగా రోజుకి ఒక వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు వివిధ మొబైల్ కంపెనీ రీఛార్జ్ ఈ-లోడింగ్, రీఛార్జ్ కార్డులు కొనుగోలు చేసుకునే వ్యాపారులు ఒకటి రెండు రోజుల్లోనే లక్షల్లో రీఛార్జ్ లోడింగ్ చేసుకున్నట్లు సమాచారం. రీఛార్జ్ లోడింగ్ చేసుకుంటే ఆ సొమ్మును భవిష్యత్తులో కస్టమర్లకు రీఛార్జ్ చేస్తూ తెల్ల డబ్బుగా మార్చే ప్రయత్నం చేసారు. పలు మొబైల్ నెట్ వర్క్ కంపెనీలకు సంబంధించిన డెమో సిమ్ లలో పలువురు వ్యాపారులు లక్షల రూపాయలు రీఛార్జ్ లోడింగ్ చేసారు. రీఛార్జ్ లోడింగ్ లలో మొబైల్ కంపెనీ లకు కొన్ని నెలల పాటు జరిగే వ్యాపారం ఈ ఒకటి రెండు రోజుల్లో జరిగినట్లు సమాచారం. ఈ రకంగా కొన్ని కోట్ల రూపాయల నల్ల ధనాన్ని తెల్ల ధనం గా మార్చే ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ వ్యవహారం పై ఆదాయపు పన్ను శాఖ వారు దృష్టి పెట్టి మొబైల్ నెట్ వర్క్ వ్యాపార సర్కిల్స్ లో దీని పై విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.