వీరంతా నెల్లూరు నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు. ఒకరికి ఒకరు ఇదివరకు పరిచయమే లేదు. ఒకరి పేరు కూడా మరొకరికి తెలీదు. సోషల్ మీడియా ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కొరకు మౌన నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. పోగయ్యింది కొద్ది మందే కానీ ఒక్కటిగా పోరాడారు. ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా నే ఆకాంక్ష గా నగరంలో వీఆర్సీ వద్ద మౌన ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ వద్ద మహాత్ముని విగ్రహానికి వినతి అందజేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి, విద్యార్ధి, యువజన సంఘాలకు సంబంధం లేని వారు పోగవ్వడం చూస్తుంటే యువతలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కు సంబంధించి ఎంతటి బలమైన బాధ్యతాయుతమైన ఆవేదన ఉన్నదో అర్థం అవుతున్నదని వీరిని చూసిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి మౌన పోరాటాన్ని అభినందిస్తున్నారు.