రాష్ట్రానికి ప్రత్యేక హోదానే లక్ష్యంగా జనవరి 26 న నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద పార్టీలకు అతీతంగా నెల్లూరు యువత తలపెట్టిన హోదా పోరాటానికి ప్రజలంతా తరలి రావాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు.
నగరంలోని ఆర్టీసీ వద్ద గల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చిల్డ్రన్స్ పార్కు వద్ద అన్ని యువజన, విద్యార్ధి సంఘాలు, జేఏసి లతో కలిసి పార్టీలకు అతీతంగా ఉదయం 10 గంటల నుండి నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, గత కొన్నాళ్లుగా పోరాటాలు చేస్తున్నదని గుర్తు చేశారు. విభజన సందర్భంలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని పూర్తి భరోసా ఇవ్వగా నేటి ప్రధాని మోడీ ప్యాకేజీల పేరుతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వంతపాడడం బాధాకరం అని అన్నారు. కేంద్ర వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని, ఆయన పోరాటాన్ని కొనసాగించాలని కోరారు.
శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను విద్యార్ధులు, యువత విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, మురళి రెడ్డి, కస్తూరయ్య, నిషాద్, మోషా, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.