దొడ్ల సుబ్బారెడ్డి జిల్లా సర్వజన ప్రభుత్వ వైద్యశాలను నెల్లూరు నగర కాంగ్రెస్ కమిటీ మరియు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం సందర్శించి అక్కడి వైద్య రీతులను పర్యవేక్షించి పలు లోపాలను ఎత్తిచూపారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఉడతా వెంకటరావు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఎలాంటి ఖర్చులు లేకుండా అత్యాధునిక వైద్యం అందాలని భావించి 400 కోట్ల రూపాయలను మంజూరు చేసి ఇక్కడ వైద్య కళాశాలను స్థాపించి ఆసుపత్రిని అభివృద్ధి పరిస్తే నేటి పాలకుల నీడలో ఇక్కడి డాక్టర్లు అవినీతి పోకడకు పోవడం బాధాకరమన్నారు. ఇక్కడ వైద్యం అందించకుండా రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు ఇక్కడి డాక్టర్లు తరలించడం దారుణమన్నారు. మంత్రి నారాయణకు చెందిన వైద్య కళాశాల డీమ్డ్ హోదా కొరకు ఇక్కడి ప్రభుత్వ వైద్యులు పనిచేస్తూ రోగులను అక్కడికి తరలించడం సమంజసం కాదని తెలిపారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రఘురామ్ ముదిరాజ్ మాట్లాడుతూ వైద్యులు ఉదయం 9 గంటలకు వచ్చి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉంటూ వ్యాపారం చేసుకోవడం దారుణమన్నారు.
అనంతరం నాయకులందరూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ రాజుని, ఛైర్మన్ చాట్ల నరసింహారావుని కలిసి వైద్య విధానాల్లో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని, డాక్టర్ల పనితీరు, రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తున్నడాక్టర్ల మాఫియా గురించి వివరించారు.
జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి ఇక్కడ జరిగే మెడికల్ మాఫియాను అరికట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉడాలి సూర్యనారాయణ, అజీజ్, వెంకటరావు, మోషా, మురళి రెడ్డి, గణేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.