చిన్నతనం నుండి పుస్తకాలపై ఆసక్తిని ఉంచి పట్టుదలతో చదవబట్టే ఇంతవాణ్ణి అయ్యాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి.నారాయణ తెలిపారు. నెల్లూరు వీఆర్సీ మైదానంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్ ట్రస్ట్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలను మంత్రి శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే కందుకూరి వీరేశలింగం గారి మాటలను గుర్తుచేసారు. జీవితంలో ఉన్నత స్థితికి చేరాలంటే పుస్తక పఠనం తప్పనిసరి అని అన్నారు. ఒక లెక్చరర్ స్థాయి నుండి మంత్రి స్థాయికి తాను చేరుకోవడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. నెల్లూరులో తిక్కన మహాభారతం రచించిన ప్రాంతాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రదర్శనలో వివిధ భాషల పుస్తకాలు కొలువుదీరాయి. విద్యార్థులు పుస్తకాలను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ప్రదర్శనలో వేదికపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిక్కన కవితారీతులు అనే అంశంపై సాహిత్య సభ జరిగింది. సుప్రసిద్ధ సాహితీవేత్తలు మోపూరు వేణుగోపాలయ్య, అల్లు భాస్కర్ రెడ్డి లు ప్రసంగించారు. ప్రముఖ కవి, రచయిత పెరుగు రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.