360 కోట్ల రూపాయలు. ఇదీ మన నెల్లూరు నగరంలో ఒకే రోజు ఒక బంగారు దుకాణంలో తేలిన లెక్క. 500 మరియు 1000 నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల కుబేరులు ఎక్కడికక్కడ లాక్ అయిపోయారు. తమ వద్దనున్న నల్ల ధనాన్ని ఎలా క్రమబద్ధీకరణ చేసుకోవాలా అని వచ్చిన ఆలోచనల్లో అందరికీ మెదిలిన మొదటి ఆలోచన బంగారు కొనుగోలు. దీంతో మాములుగా జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేసే బంగారాన్ని ఎలాగుంటే ఏమిలే చేతికి బంగారం అందితే చాలని మార్కెట్ పై పడ్డారు. శుక్రవారం నాడు కాపువీధి లోని డీపీ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దుకాణం లో సోదాలు నిర్వహించిన ఆదాయపు శాఖ వారికి దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. బంగారాన్ని గ్రాముకు 1000 రూపాయలు అధికంగా చెల్లించే విధంగా కూడా పలువురు ముందస్తు బుకింగ్ లు చేసారు. 360 కోట్ల రూపాయల వ్యాపారంలో 36 కోట్ల రూపాయలను బంగారు వ్యాపారస్తులు ఈ డీల్ వల్ల అప్పనంగా పొందారు. బంగారు బిస్కెట్లు కూడా భారీగా చెలామణి అయినట్లు సమాచారం. ఈ సోదాల వార్తలు విన్న బంగారు వ్యాపారస్తులు అందరూ తమ దుకాణాలను ముందస్తుగా మూసేసారు. ఒక్క దుకాణంలోనే ఇంత బయటపడితే మరిన్ని సోదాలు జరిగితే ఇంకెంత బయటపడుతుందో అని ప్రజలు విస్తుపోతున్నారు.