Site icon 123Nellore

జంబ్లింగ్ లో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ లో అక్రమాలను అడ్డుకోండి

ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి సారిగా ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఈ ప్రాక్టికల్స్ లో ప్రైవేటు కళాశాలలు అక్రమాలకు పాల్పడకుండా చూడాలని కోరుతూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నాయకులు శనివారం ఆర్ఐవో కు వినతిపత్రం అందజేసారు.
వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నగర అధ్యక్షులు శేషు గౌడ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో ప్రాక్టికల్స్ జంబ్లింగ్ లో జరగనుండడంతో పలు ప్రైవేటు కళాశాలలు తీవ్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలకు అనేక బ్రాంచిలు ఉండడం చేత ఒక బ్రాంచి లో విద్యార్ధులు మరో బ్రాంచిలో పడకుండా హాల్ టికెట్లు జారీ చేయాలన్నారు. ప్రతి కళాశాలలో మంచి సదుపాయాలు గల ల్యాబులు ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదన్నారు. హాల్ టికెట్ లలో కళాశాలల చిరునామా పూర్తిగా ముద్రించి విద్యార్ధులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉన్నందున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరీక్షల తీరుని అక్రమాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకేశ్, రూరల్ కన్వీనర్ మధు, నగర జనరల్ సెక్రటరీ వెంకటేష్, కార్యదర్శులు సమీ, పవన్, విద్యా, సాయి, పార్ధు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version