నెల్లూరులో ప్రజలకు చిల్లర కష్టాలు ఏర్పడ్డాయి. బ్యాంకుల నుండి, ఏటీఎం ల నుండి తమ ఖాతాల్లో ఉండి కూడా తగినంత సొమ్ము చేతికి అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఓ సమస్య కాగా అంతో ఇంతో బ్యాంకుల నుండి, ఏటీఎం ల నుండి అందే సొమ్ము 2000 రూపాయల నోట్ల రూపంలో ఉంటుంది. మార్కెట్ లోకి ఆ నోట్లు పట్టుకెళ్లిన వారికి చిల్లర సమస్య తీవ్రంగా ఎదురవుతున్నది. ఏదైనా అంగడిలో ఆ నోట్లు ఇస్తుంటే వ్యాపారస్తులు చిల్లర లేక తీసుకోవట్లేదు. కస్టమర్లు “ఏందయ్యా, చిల్లర పెట్టుకోకుండా వ్యాపారం చేస్తున్నావా?” అనే ప్రశ్నలు వేస్తుండడంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. కొంతమందిలో సహనం కోల్పోయి అది ఘర్షణగా మారి పరస్పరం ఒకరినిఒకరు తిట్టుకుంటూ కొట్టుకునే వరకూ పరిస్థితులు మారిపోతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి ఇటువంటి సంఘటనే మాగుంట లేఅవుట్ లోని సంబరాలు చేసుకునేది గా పేరొందిన రెస్టారెంట్ కు చెందిన టిఫిన్స్ హోటల్ లో జరిగింది. కుటుంబంతో వచ్చిన ఓ కస్టమర్ టిఫిన్ చేసి బిల్లు చెల్లించే క్రమంలో 2000 రూపాయల నోటు ఇవ్వగా చిల్లర లేదని హోటల్ నిర్వాహకుల నుండి సమాధానం ఎదురైంది. చిల్లర ఎందుకు పెట్టుకోరని కస్టమర్, అంత మొత్తానికి చిల్లర ఎక్కడ ఉంటుందని హోటల్ ఓనర్ పరస్పరం వాదనకు దిగారు. ఈ వాదన అటూ ఇటూ తిరిగి తిట్టుకోవడం వరకూ కొంతలో కొట్టుకోవడం వరకూ వెళ్ళింది. ఆ కస్టమర్ కుటుంబ సభ్యులు, హోటల్ లో పనిచేసే సిబ్బంది, ఇతర కస్టమర్లు గొడవ పెద్దది కాకుండా ఇరువురినీ ప్రక్కకు తీయాల్సి వచ్చింది. ఇలా నోట్ల కష్టాల వలన నగరంలో అనేక చోట్ల ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో అయినా ఈ నోట్ల కష్టాలు తీరుతాయా లేక మరింత జఠిలమవుతాయా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.