Site icon 123Nellore

క్యాష్ లెస్ విధానం లో సాంకేతిక తప్పిదాలు ఘోరంగా ఉన్నాయన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

క్యాష్ లెస్ చేయండి… క్యాష్ లెస్ చేయండి…. నగదు రహిత లావాదేవీలు పెంచాలని ప్రభుత్వం చేస్తున్న ఊకదంపుడు ప్రచారం ఇది. అందుకు తగ్గట్లు బ్యాంకులు సాంకేతికంగా సిద్ధంగా ఉన్నాయా అంటే సమాధానాలు శూన్యం. ప్రభుత్వం క్యాష్ లెస్ చేయమంది కదా అని తమ ఏటీఎం కార్డులను ఎదో ఒక దుకాణం లో స్వైప్ చేస్తే ఆ లావాదేవి ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా జరిగితే సరి, లేదంటే తమ ఖాతాల్లో నుండి కోత పడిన డబ్బులు తిరిగి ఖాతాలో చేరక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటివరకు నోట్లు దొరక్క బ్యాంకుల వద్దకు తిరుగుతుంటే నోట్లు తమ వద్ద అందుబాటులో ఉన్నదీ, లేనిదీ, ఎప్పుడు వచ్చేది అయినా బ్యాంకు అధికారులు చెప్పే పరిస్థితుల్లో ఉండేరు కానీ ఇప్పుడు సాంకేతికంగా ఏర్పడిన ఇబ్బందులు ఎన్ని రోజుల్లో తీరుతాయో ఆ డబ్బులు ఎప్పుడు రీఫండ్ అవుతాయో చెప్పే పరిస్థితుల్లో బ్యాంకు అధికారులు లేరు. 48 గంటల్లో పరిష్కారం అంటున్నా రోజుల తరబడి సమస్య పరిష్కారం కాక తమ ఖాతాలో ఉండే డబ్బు చేరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా ఇలాంటి పరిస్థితే మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఎదురైంది. నెల్లూరులో జగన్ పర్యటన హడావుడిలో ఉండిన ఎమ్మెల్యే కారు లో ప్రయాణిస్తూ ఆకుతోట వద్ద 2500 రూపాయలకు డీజిల్ పట్టించారు. తన ఏటీఎం కార్డుతో 2500 రూపాయలు స్వైప్ చేస్తే ఎమ్మెల్యే మొబైల్ ఫోన్ కు 16000 రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇదేంటని దుకాణదారున్ని ప్రశ్నిస్తే 2500 రూపాయలు వచ్చినట్లు స్లిప్ ఇచ్చి విస్తు పోవడం అతని వంతైంది. జగన్ పర్యటన హడావుడిలో ఉండిన ఎమ్మెల్యే తర్వాత చూద్దాం లే అని బ్యాంకు స్టేట్ మెంట్ ను తెప్పించుకోగా అందులో మొత్తం 23100 రూపాయలు కట్ అయినట్లు చూపింది. అంటే 20600 రూపాయలు అధికంగా కట్ అయ్యాయి. ఇదేంటని ఎమ్మెల్యే తన ఎకౌంటు ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ లో సంప్రదించగా ఏదైనా సాంకేతిక సమస్య ఎదురై ఉంటుంది రెండు రోజుల్లో సమస్య తీరుతుంది అని తెలిపారు. 48 గంటలు దాటినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే అయినా తానే బ్యాంకు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా సమస్య త్వరగా తీరలేదని, ఇక సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అని అన్నారు. క్యాష్ లెస్ అంటున్న ప్రభుత్వాలు సామాన్యులకు అనేక సమస్యలను గుదిబండలా మార్చాయని, ఇదే పరిస్థితి ఒక పేద లేదా మధ్య తరగతి వ్యక్తికి ఏర్పడి 20 వేల రూపాయలు ఎకౌంటు లో ఉండి కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడిపోతే ఆ సమస్య తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని ప్రశ్నించారు.
  
Exit mobile version