Site icon 123Nellore

కాంట్రాక్టు అధ్యాపకుల వ్యవహారంలో ప్రభుత్వం నీతిమాలిన చర్యలకు పాల్పడడం దారుణం: ఎస్ఎఫ్ఐ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒప్పంద పద్ధతిలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులతో కలిసి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది. 
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాయుడు రవి మాట్లాడుతూ గత 28 రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులందరూ తమ విధులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్ లతో ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. న్యాయబద్ధంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మానవవనరుల శాఖామంత్రి షోకాజ్ నోటీసులు జారీ చేయడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. 16 సంవత్సరాలకు పైగా ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వారి జీవితాలను బజారు పాలు చేయాలని ఈ ప్రభుత్వం చూడటం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. తక్షణమే అధ్యాపకుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించి తరగతుల్లో నాణ్యమైన బోధన జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు లెక్చరర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి నందకిరణ్, నాయకులు సాయి, నవీన్, వెంకి, అధ్యాపకుల గౌరవ అధ్యక్షులు సతీష్, రేవతి, శ్రీను, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
 
Exit mobile version