ఆంధ్రప్రదేశ్ లో మరో విద్యాకుసుమం ప్రాణాలు విడిచింది. గుంటూరులో రిషితేశ్వరి మరణాన్ని ఇంకా ప్రజలు మరిచిపోకముందే కర్నూలులో మరో బంగారు తల్లి బలైంది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని కడుపు కోతను మిగిల్చింది. ర్యాగింగ్ కారణమని కొందరు, కాదు ఓ కామాంధుడి మదమే కారణమని మరికొందరు తెలియజేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా బద్వేలు మండలం పుట్టాయి పల్లె గ్రామానికి చెందిన జయరామిరెడ్డి, జయమ్మల కుమార్తె ఉషారాణి (18) కర్నూలు జిల్లా నంద్యాల లోని ఆర్జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కళాశాలలో సీనియర్ విద్యార్థుల నుండి వేధింపులు, వెంకటేశ్వర్లు అనే అధ్యాపకుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. 15 రోజుల క్రితమే ఇంటికి వచ్చేసిన విద్యార్థినికి కాలేజీలో మాట్లాడతాం అని నచ్చజెప్పి తండ్రి గురువారం కర్నూలు తీసుకెళ్లారు. కళాశాలలో ప్రిన్సిపాల్ వద్ద మాట్లాడి తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరి హాస్టల్ లోకి కుమార్తెను తండ్రి ఏమైనా ఇబ్బందులు ఉంటె చెప్పని ఇక్కడే ఉంటానని చెప్పి లోనికి పంపారు. ఓ గంట తర్వాత ఉషారాణి ఇక్కడ నేను ఉండలేకున్నాను నాన్నా అంటూ ఏడుస్తూ వచ్చేసింది. దీంతో ఆ తండ్రి తన బిడ్డను కారులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో కుమార్తె వాంతులు చేసుకోవడం గమనించిన ఆయన హుటాహుటిన కడపలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విషం తాగిన ఉషారాణి పరిస్థితి విషమించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది.
ర్యాగింగ్ కారణమని తెల్పుతున్న కళాశాల యాజమాన్యం
ఈ వ్యవహారానికి ర్యాగింగ్ కారణమని కళాశాల వారు తేల్చారు. హాస్టల్ లో సహచర విద్యార్థినులు ఉషారాణి పై పెరుగు పోసి ఏడిపించారని, కాళ్ళు అడ్డం పెట్టి పడగొట్టారని అప్పడు వీడియో తీసారని దీనికి మనస్థాపం చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలియజేస్తున్నారు.
అధ్యాపకుని ముసుగులో ఉన్న కామాంధుడి మదమే కారణమని పలువురి ఆరోపణ
కళాశాలలో బోధన చేసే అధ్యాపకులు వెంకటేశ్వర్లు ఉషారాణి ని లోబరుచుకుని కామవాంఛ తీర్చుకోవాలని అనుకున్నారని, అందులో భాగంగా పలువురు సీనియర్ విద్యార్థినులకు మార్కులు ఎక్కువ వేస్తాం తన ఫోటోలు కావాలని అడిగారని, వాట్స్ యాప్ ద్వారా ఫోటో లు సేకరించాడని, ఉషారాణి బాత్రూమ్ లో ఉండగా కొందరు విద్యార్థినులు వీడియో చిత్రీకరించి వాట్స్ యాప్ ద్వారా పంపారని, వాటిని ఆసరా చేసుకుని అధ్యాపకుడు తన పై జరిపిన వేధింపులే ఆత్మహత్యకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏదేమైనా ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని పలువురు కోరుతున్నారు.