Site icon 123Nellore

ఉద్రిక్తంగా మారిన ABVP నిరాహార దీక్ష – వీఆర్సీ సెంటర్ లో గందరగోళం – వర్శిటీ వీసీని రప్పించిన పోలీసులు

విక్రమ సింహపురి యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, తక్షణం యూనివర్సిటీని నూతన భవనాల్లోకి మార్చాలని, అవినీతి రిజిస్ట్రార్ శివశంకర్ ను తొలగించాలని వీ.ఎస్.యూ శాఖ ABVP విద్యార్ధులు చేప్పట్టిన నిరవధిక నిరాహారదీక్ష మూడో రోజు ఉద్రిక్తంగా మారింది. మొదటి రెండు రోజుల్లో స్థానిక  ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మరియు బీజేపీ నాయకుల నుండి వీరికి మద్దతు లభించగా మూడో రోజు వర్శిటీ కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపారు. మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న విద్యార్ధుల శిబిరాన్ని పోలీసులు భగ్నం చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ABVP నాయకులతో కలిసి వర్శిటీ విద్యార్ధినీ విద్యార్ధులు వీఆర్సీ సెంటర్ లో రోడ్డు పై బైటాయించి తమ డిమాండ్స్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని రాస్తారోకో చేపట్టారు. ఘటనాస్థలికి పోలీసులు చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్శిటీ వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు విద్యార్ధులు కదలమని బైటాయించారు. అంబేద్కర్ విగ్రహం ఎక్కి పెట్రోల్ పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీక్ష కారణంగా నీరసించిన ఓ విద్యార్ధి సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ క్రమంలో ABVP నాయకులను, విద్యార్ధులను పోలీసులు బలవంతం మీద అరెస్ట్ చేసి 4వ నగర పోలీసు స్టేషన్ కు తరలించారు. డీ.ఎస్.పీ వెంకటరాముడు జరిగిన పరిస్థితులపై సమీక్షించి తక్షణం విద్యార్ధుల వద్దకు రావాల్సిందిగా వైస్-ఛాన్సలర్ వీరయ్య ను కోరారు. పోలీస్ స్టేషన్ కు చేరిన వీరయ్య విద్యార్ధులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, బిజెపి నాయకులు ఆంజనేయరెడ్డి, సురేందర్ రెడ్డి ల జోక్యంతో వైస్-ఛాన్సలర్ వీరయ్య దీక్షా స్థలికి చేరి విద్యార్ధులతో చర్చలు జరిపి దీక్ష విరమింపజేసారు. ABVP జాతీయ కార్యదర్శి సురేష్, వర్శిటీ ABVP విభాగం అధ్యక్ష కార్యదర్శులు సాంబ శివారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 
  
Exit mobile version