ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా అవహగానా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన్సూర్ నగర్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు సయ్యద్ కాషిప్ మాట్లాడుతూ నేడు సమాజంలో యువతరంలో కొంతమంది మత్తు పదార్థాలకు, మద్యం వ్యసనాలకు బానిసై దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు “ఆరోగ్యవంతమైన ప్రజలు – ఆరోగ్యవంతమైన దేశం” అనే అంశం పై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. నవంబర్ 27, ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు స్థానిక చేపల మార్కెట్ ప్రాంతంలో గల పార్కులో (మేకల మండి) అవగాహనా సదస్సు జరుగునని, ఈ కార్యక్రమంలో నగర మేయర్, వైద్యులు, ముస్లిం మైనారిటీ నాయకులు, స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటారని ప్రజలకు ఉచిత వైద్య సలహాలు, యోగాసనాల ప్రదర్శన, వాటి ఉపయోగాలు తెల్పుతారని తెలిపారు. సంస్థ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు ముఫ్తి అబ్దుస్ సబహాన్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యవంతైన దేశాన్ని నిర్మించుకోవడంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు.